మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం

Good news to AP Govt women employees. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగిణుల పిల్లల సంరక్షణ

By అంజి  Published on  9 March 2022 3:38 AM GMT
మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగిణుల పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది. 60 రోజులు ఉన్న పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. మహిళా ఉద్యోగుల సెలవులకు సంబంధించి మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ ఉత్తర్వులను జారీ చేశారు. పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర సెలవులతో కలిపి ఈ సెలవులను ఉపయోగించుకునే ఛాన్స్‌ కల్పించారు.

దత్తత శిశువు వయస్సు 30 రోజుల్లోపే ఉంటే సంవత్సరం వరకు సెలవు తీసుకోవచ్చు. శిశువు వయస్సు 6 నెలల నుండి 7 నెలలలోపు ఉంటే 6 నెలల సెలవు తీసుకోవచ్చు. 9 నెలల ఉంటే 3 నెలల సెలవు దొరుకుతుంది. అయితే ఇవన్నీ ఇతర సెలవులతో పాటు అదనంగా వర్తిస్తాయి. దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లైతే ఎలాంటి సెలవులు ఉండవు. అటు వికలాంగ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి సంవత్సరం ఏడు రోజుల పాటు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు తీసుకోవచ్చు. హైరిస్క్‌ వార్డుల్లో పని చేసే నర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఈ సెలవులు పొందవచ్చు. పలు వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Next Story