అమరావతి: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని మంత్రి వెల్లడించారు. గుంటూరులో మిర్చి యార్డును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 అందిస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయి. ఆలస్యం చేయకుండా రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నాం'' అని మంత్రి అచ్చెన్న తెలిపారు.
''వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కృషి చేస్తున్నాము. గుంటూరు మిర్చి యార్డులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాము. మిర్చి యార్డును గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది. మిర్చి యార్డు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాము'' అని మంత్రి అచ్చెన్న వివరించారు. ప్రకృతి విపత్తులు, తుఫానులతో దెబ్బ తిన్న ధాన్యం కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చేందుకు ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.