రాయితీ రుణాలపై ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్‌సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తానికి 50 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేల రాయితీ లభిస్తుంది. మిగతా అప్పుపైనా వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదట 1500 మందికి రుణాలు ఇవ్వడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రాయితీ విడుదలకు మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.151 కోట్లు ఇవ్వనుంది.
ప్రస్తుతం 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు.. తర్వాత నిరంతర ప్రక్రియగా మూడేళ్లపాటు కొనసాగించేందుకు కసరత్తు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి లబ్ధిదారులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులు తీసుకున్న మొత్తాన్ని నెల వారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు తీసుకుంటే రూ.50 వేలు రాయితీ పోనూ మిగతా రూ.50 వేలను 36 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. వ్యవసాయానికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, బిజినెస్ ఏర్పాటుకు దీన్ని వర్తింపచేయనున్నారు. కాగా ఎస్సీ లబ్ధిదారుల పేరుతో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.