ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్లాట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By అంజి Published on 26 Dec 2024 7:48 AM ISTఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్లాట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. పెండింగ్ దరఖాస్తులను మార్చి చివరి నాటికి పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకం 2020 ప్రారంభం అయ్యింది. 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్బన్ డెవలప్‌మెంట్ సంస్థల్లో నిలిచిపోయిన ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లపై మరోసారి తాఖీదులు ఇవ్వనున్నారు. వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి కావాల్సిన సమాచారం, దస్త్రాలు, ఫీజులపై అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
గతంలో ఇలా నోటీసులు ఇచ్చిన స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దరఖాస్తుదారులతో సర్వేయర్లు మాట్లాడి అర్బన్ డెవలప్‌మెంట్ సంస్థలు అడిగిన అదనపు సమాచారం పంపాలి. సర్కార్ ఆదేశాలతో అడ్రస్ అందుబాటులో ఉన్న దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు పంపనున్నారు. మిగతా వారికి ఫోన్లలో సమాచారం అందించనున్నారు. అడిగిన అదనపు సమాచారం, దస్త్రాలు పంపిన వారందరి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.