ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు మంచి వైద్యం, మందులు అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టైంకి మందులు అందించాలన్నారు. ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని, అందరి ఫోన్‌లలో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న హెచ్9ఎన్2 వైరస్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. 2023 - 24లో భాగంగా నవంబర్ నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించారు. ఇది గత ఏడాది కంటే 24.64 శాతం అధికం అని పేర్కొన్నారు.