ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందా? స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఇన్ని రోజులు ఎదురుచూపుల్లోనే గడిపేస్తూ వచ్చారు.
అయితే ఇటీవల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది. కాగా వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఉన్నత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే విధుల్లో చేరతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.