విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 6:37 AM ISTవిద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు విద్యార్థులకు అందిస్తోన్న కాస్మోటిక్ చార్జీలును ఆపేస్తూ.. నేరుగా వస్తువులనే ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా చార్జీలను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. అయితే.. నగదు సకాలంలో అందేది కాదనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో.. విద్యార్థులు కాస్మొటిక్ వస్తువుల విషయంలో కాస్త ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే నగదు కాకుండా.. నేరుగా కాస్మొటిక్ వస్తువులనే విద్యార్థులకు సకాలంలో అందజేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.పేస్టు, బ్రష్, షాంపూ వంటి వస్తువులను నేరుగా విద్యార్థులకే ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ ప్రతిపాదనను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు వద్దకు పంపారు. ఆయన ఓకే చెప్పిన తర్వాత వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది. కాగా.. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా 548 పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో సుమారుగా 1.25 లక్షల మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. వీరి కోసం ప్రతి నెలా కాస్మొటిక్ చార్జీల కోసం దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు అధికారులు. అయితే.. గత ప్రభుత్వం నిధులను పెండింగ్‌లో పెట్టడంతో సుమారు 10 కోట్ల రూపాయలు బకాయిలు పడినట్లు తెలిసింది. అందుకే ఈసారి డబ్బులను కాకుండా నేరుగా వస్తువులనే విద్యార్థులకు అందించేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు 2014 -19 మధ్య కాలంలోనూ టీడీపీ ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా విద్యార్థులకే అందించింది. కాస్మొటిక్ వస్తువులుగా బ్రష్, పేస్ట్, షాంపూ, సబ్బు, పౌడర్, తిలకం, కొబ్బరినూనె ఇచ్చారు.