వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించేందుకు వీలుగా 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అక్టోబరు 2 నాటికి తమ ప్రొబేషన్‌ను పూర్తిచేసుకోనున్నారు. ప్రొబేషన్ సమయం పూర్తి కానుండడంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జూన్ 9న ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఫెడరేషన్) చైర్మన్ కె. వెంకటరామిరెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అక్టోబరు రెండు నాటికి తమ ప్రొబేషన్‌ను సమయాన్ని పూర్తిచేసుకోనున్నారని.. అనంతరం వారు రెగ్యులర్ పేస్కేల్ పరిధిలోకి వస్తారని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులను తొలగించినట్టు పేర్కొన్నారు. కాగా, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా అంజన్ రెడ్డి, కార్యదర్శిగా అంకారావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భార్గవ్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో లక్ష మందితో నవంబర్‌లో సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.