ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది
By - Knakam Karthik |
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వేతనాల చెల్లింపుల కోసం రెండో విడత, రెండో ట్రాంచ్ కింద మొత్తం రూ.1030.90 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్రానికి కేంద్రీయ సహాయాన్ని విడుదల చేసింది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ఆమోదంతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రస్తుత మదర్ సాంక్షన్ కింద రూ.988.00 కోట్లతో పాటు, గతంలో మిగిలిన రూ.42.90 కోట్లను కలిపి ఈ మొత్తం నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
విడుదల చేసిన నిధుల్లో..షెడ్యూల్డ్ కులాలకు (SC) రూ.164.00 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు (ST) రూ.145.59 కోట్లు, ఇతర వర్గాలకు రూ.678.40 కోట్లు కేటాయించారు. ఈ నిధులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (NeFMS) ద్వారా, రాష్ట్రం రూపొందించే FTOల ఆధారంగా దశలవారీగా వేతనాల చెల్లింపుల కోసం విడుదల చేయనున్నారు.
ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఈ నిధులను వినియోగించాలని, ద్వంద్వ చెల్లింపులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఈ నిధులతో రాష్ట్రంలోని గ్రామీణ కార్మికులకు సకాలంలో వేతనాల చెల్లింపు జరగడంతో పాటు, ఉపాధి హామీ పథకం అమలు మరింత పటిష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు.