విద్యార్ధులకు గుడ్‌న్యూస్ : ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివ‌ర్గం ఆమోదముద్ర

Good News For AP Students. ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

By Medi Samrat  Published on  30 Jun 2021 9:17 AM GMT
విద్యార్ధులకు గుడ్‌న్యూస్ : ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివ‌ర్గం ఆమోదముద్ర

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది రాష్ట్ర మంత్రివర్గం. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. ఇక 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర వేసింది మంత్రివ‌ర్గం.

అలాగే.. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు ఆమోద తెల‌ప‌డంతో పాటు.. జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి నిర్ణ‌యం తీసుకున్న‌ మంత్రివర్గం.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం తెలిపింది. 2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలప‌డంతో పాటు.. కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చించింది.

రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేబినేట్‌. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపింది. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. తొలిదశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెల‌ప‌డంతో పాటు.. విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకుంది మంత్రివ‌ర్గం.


Next Story