నివాస‌ స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై స‌మీక్ష‌.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం నియోజక వర్గంలో ఇళ్ళ నిర్మాణాలు,ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలపై రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యుడు డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

By Medi Samrat
Published on : 28 July 2025 5:33 PM IST

నివాస‌ స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై స‌మీక్ష‌.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం నియోజక వర్గంలో ఇళ్ళ నిర్మాణాలు,ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలపై రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యుడు డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నియోజక వర్గంలో మండలాలు వారీగా ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలపట్టాలు, ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కైకలూరు నియోజకవర్గంలో గృహ నిర్మాణ సమస్యలపై స్థానిక సిఎన్ఆర్ గార్డెన్స్ సమీక్ష నిర్వహించారు. కైకలూరు గ్రీన్ విలేజ్, కలిదిండి, మండవల్లి మండలాల్లోని లే అవుట్లలో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. తొలుత కైకలూరు గ్రీన్ విలేజీని సందర్శించి అక్కడ అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్థంగా ఉ న్న ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల సమస్యను, తాగునీటి సమస్యను, విద్యుత్తు వంటి మౌలిక సమస్యలను స్వయంగా పరిశీలించానని తెలిపారు.

గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షలు 30 లక్షలు పక్కా గృహాలు నిర్మిస్తున్నామని ఆర్భాటపు ప్రచారాలు చేసి చివరకు లబ్దిదారులను నిండా ముంచేసిందని ఆరోపించారు. ఒక ప్రణాళిక లేకుండా ఒక విజన్ లేకుండా గృహనిర్మాణ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఫలితంగా లబ్దిదారులు తీవ్రంగా నష్ట పోయారని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో అర్హత కలిగిన మిగిలిన ప్రతి పేదవానికి అర్బన్‌లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున నివాస‌ స్థలాలు మంజూరు చేసి రూ.2.50 లక్షలు చొప్పున మంజూరు చేస్తుందని తెలిపారు. అదనంగా బీసీలకు, ఎస్సీలకు రూ 50 వేలు చొప్పున, ఎస్టీలకు రూ 75 వేలు నుంచి రూ 1 లక్ష చొప్పున అదనంగా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారని తెలిపారు. స్వంతంగా ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు రూ.1 లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. కైకలూరు గ్రీన్ విలేజ్లో అసంపూర్తిగా నిలిచి పోయిన ఇళ్లను త్వరితగతిన క్రొత్త కాంట్రాక్టరుతో నిర్మాణాలు పూర్తి చేస్తామని,అందుకు కావాల్సిన నిధులు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రీన్ విలేజ్లో రోడ్లు, విద్యుత్తు,తాగునీరు వంటి ప్రధాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి సారథి స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగిందని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం,అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే దమ్ము ఒక కూటమి నాయకులకే ఉందని స్పష్టం చేశారు.ఎందుకంటే సంక్షేమం,అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే నని పేర్కొన్నారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. అలాగే ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అభివృద్ధి జరుగుతోందా లేదా అన్న విషయాలపై బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వ ప్రజాత్రినిధులు, నాయకులు ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకోవటం గర్వకారణం అన్నారు.గత ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు తప్ప సంక్షేమం,అభివృద్ధి కానరాలేదన్నారు.అలాగే గత ప్రభుత్వంలో దోపిడీలకు, అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని, సంక్షేమ పథకాల అమలుతోపాటు అక్రమార్కులపై చర్యలు ఉంటాయని ఆమె ఉద్ఘాటించారు.కైకలూరు నియోజకవర్గంలో 'డాగ్ ట్రైనింగు సెంటరు' ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో రక్షిత తాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని,రూ.2.40 కోట్లతో డ్రెయినేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అలాగే కైకలూరు గ్రామ పంచాయతీ సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. నియోజకవర్గంలో పక్కాగృహ నిర్మాణ వ్యవస్థపై పూర్తిగా అసంతృప్తి ఉందని, కైకలూరు గ్రీన్ విలేజీ రూ 200 కోట్లు ఖర్చుపెట్టినా లబ్ది దారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారన్నారు. లబ్దిదారుల ఎంపికలోను తప్పులు జరిగాయని అన్నారు.లే-అవుట్లలో కొన్ని ప్లాట్లు ఇంకా లబ్దిదారులకు కేటాయించలేదని, రహదారులు నిర్మాణం జరగలేదని,డ్రెయిన్ల నిర్మాణం జరగలేదని,తాగునీరు, విద్యుత్తు సౌకర్యం పూర్తిస్థాయి లో కల్పించలేదని అన్నారు. చాలా ఇళ్లు అసంపూర్తిగా నిలిచి పోయాయన్నారు. అలాగే కలిదిండిలో 600 మందికి ప్లాట్లు కేటాయించారని, రెండు ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని,మిగిలిన ఫ్లాట్లు మొత్తం లెవిలింగు చేయాల్సి ఉందని, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.6 నుంచి 7 కోట్లు అవసరం అవుతాయని అన్నారు. మండవల్లిలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు.

Next Story