పోలవరం వద్ద ఉగ్ర గోదావరి
భారీ వర్షాలు, వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
By Medi Samrat
భారీ వర్షాలు, వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఎగువన నీటిమట్టం 27.230 మీటర్లకు చేరగా, దిగువన 18 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టుకు చెందిన 48 గేట్లను ఎత్తి, స్పిల్‌వే ఛానెల్ ద్వారా 1,13,436 క్యూసెక్కుల మిగులు జలాలను తిరిగి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహం కారణంగా, మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకల కోసం నిర్మించిన రహదారి పూర్తిగా నీట మునిగింది. పోలవరం, గూటాల గ్రామాల మధ్య ఉన్న ఇసుక తిన్నెలు కూడా క్రమంగా వరద నీటిలో మునిగిపోతున్నాయి.
భారీ వర్షాల కారణంగా గోదావరిలో పాపికొండల టూర్‌కు కూడా బ్రేక్ పడింది. వర్షాలతో వాగులు, వంకలు పొంగడంతో పాటు గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సీలేరు, శబరి నదుల నుంచి కూనవరం వద్ద గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి. టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల టూర్‌ను నిలిపివేశారు.