మదనపల్లెలో 7 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఏరులై పారుతున్నాయని చెప్పడానికి ఈ దారుణమే నిదర్శనమని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ వట్టి మాటలేనని, క్షేత్రస్థాయిలో నిఘా ఉక్కుపాదం లేనేలేదని విమర్శించారు.
గంజాయి మత్తులో ముక్కుపచ్చలారని పసిబిడ్డపై జరిగిన ఈ పైశాచికం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన షర్మిల, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు.