పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. షటిల్ ఆడుతున్న సర్కిల్ ఇన్‌స్ఫెక్టర్ భగవాన్ ప్రసాద్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. పక్కనున్న వారు తేరుకుని కాపాడే ప్రయత్నం చేసినా అవేవి ఫలించలేదు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భగవాన్ ప్రసాద్ మృతి పట్ల సహచర అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇదిలావుంటే.. సీఐ భగవాన్ ప్రసాద్ మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో మంచి అధికారిగా పేరు సంపాదించిన భగవాన్ ప్రసాద్ ఆకస్మిక మృతి చాలా విచారకరమని అన్నారు. భగవాన్ ప్రసాద్ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్న ఆయన.. సీఐ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా భగవాన్ ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఆళ్ల నాని అన్నారు.