వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయని, జడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్ కు కనీస భద్రత కూడా కల్పించడం లేదని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. జగన్ ను లేకుండా చేయాలనే లక్ష్యంతో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇంటి దగ్గర కూడా సరైన భద్రతను కల్పించడం లేదన్నారు. జగన్ పర్యటనల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండలానికి ఒకరిని చంపితే కానీ భయం రాదనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, జగన్ ను లేకుండా చేయాలని చూస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసుల గురించి మాత్రమే జగన్ మాట్లాడారని, నిజాయతీగా పనిచేసే పోలీసులకు తాము సెల్యూట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముగ్గురు డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. పలువురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇవ్వలేదని, దాదాపు 200 మంది పోలీసు అధికారులను వీఆర్ లో పెట్టారన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారని, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.