ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు.. ఇలా బుక్ చేసుకోండి..
ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే ఉచితంగా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
By Srikanth Gundamalla Published on 8 July 2024 6:42 AM ISTఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు.. ఇలా బుక్ చేసుకోండి..
ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే ఉచితంగా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచే ఈ కీలక హామీని అమలు చేస్తోంది. ఉచిత ఇసుక విధానాన్ని జూలై 8వ తేదీ నుంచే అమలు చేస్తున్నారు. వినియోగదారులు ఇసుక తవ్వకాలు, సీనరేజ్, రవాణా ఖర్చులు వంటి నామమాత్రపు రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇసుకను పొందేందుకు డిజిటల్ విధానం ద్వారా బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా పూర్తి పారదర్శకంగా వినియోగదారులకు ఉచిత ఇసుక అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న స్టాక్ పాయింట్ల దగ్గర సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం అందబాటులో ఉండదు. ఉచిత ఇసుక విధానం డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం 16 జిల్లాల్లో బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారు.
ఇసుక అందుబాటు విషయాలు సహా ఇసుక స్టాక్ పాయింట్లను గనులశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఉచిత ఇసుక విక్రయాలను ఏరోజుకు ఆ రోజు వివరాలను అప్‌డేట్ చేస్తారు. ఇక ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు చేతిరాతతో బిల్లులు ఇస్తారు.. ఆ తర్వాత వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారా జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో గృహ నిర్మాణరంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుకను ఇవ్వనున్నారు. అంతేకాదు ఉచితంగా ఇసుక తీసుకెళ్లి ప్రైవేటుగా అమ్మకూడదు అనే నిబంధనలు ఉన్నాయి.