నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుతో మరో ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు అమలుచేసినట్లయింది. 2019-24 మధ్య అయిదేళ్ల పాటు ఆనాటి ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల చేనేత కార్మికులు అన్ని విధాలా నష్టపోయారు. ఇదే విషయం గుర్తించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్... చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, చేనేతలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. నేత్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రూ.10 వేల కోట్లతో నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారు. మొదటి ఏడాది పెన్షన్ల రూపంలోనే రూ.370.89 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. చేనేతలకు త్రిఫ్ట్ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ త్రిఫ్ట్ పథకానికి మరో రూ.5 కోట్లు కేటాయించారు. క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. నేటితరం అభిరుచులకు అనుగుణంగా నూతన వస్త్రాల తయారీలో అయిదు జిల్లాల్లో నేతన్నలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. చేనేత వస్త్రాల విక్రయాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఆప్కో నేతృత్వంలో ఈ కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డెలివరీ చేస్తున్నారు. జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 2024-25లో 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా చేనేతలకు రుణాలు అందజేశారు. ముడి పదార్థాల సరఫరా పథకం నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. విశాఖపట్నంలో రూ.172 కోట్లు యూనిటీ మాల్ నిర్మిస్తున్నారు. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్లో టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించబోతున్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా రూ.125 కోట్ల వ్యయం...
చేనేతల ఆర్థిక వృద్ధికి మరో కీలక పథకం ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆదారపడి జీవిస్తున్నారు. వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500ల ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల మేర భారం పడనుంది.
నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ గిఫ్ట్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు కూటమి ప్రభుత్వం గిఫ్ట్ అందజేసింది. ఉచిత విద్యుత్ పథకం అమలు తీరుతెన్నులపై పెన్షప్ల పండగ నిమిత్తం కడప పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖామంత్రి సవిత చర్చించారు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి సవిత హర్షం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం వర్తింప జేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేస్తూ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉచిత విద్యుత్ పథకం వల్ల చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేతలకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు వారి కుటుంబాలు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కలిగించేలా పలు ఒప్పందాలు చేసుకున్నారన్నామన్నారు. త్వరలోనే చేనేత సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేష్ విడుదల చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.