అర్హతే ప్రమాణికంగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ను అందించాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో సోమవారం సీపీడీసీఎల్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలవాలన్న లక్ష్యంతో తొమ్మిది గంటల పాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ ను అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని, వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేయాలని డిస్కం అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి, కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశించారు.
సీఎం జగన్ రైతుపక్షపాతిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నారని, దీనిని సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మార్చి నెలాఖరు నాటికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించామని తెలిపారు.