ఏపీలో మహిళలకు మరో శుభవార్త

ఏపీలో మహిళలు అందరూ ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

By Kalasani Durgapraveen  Published on  2 Nov 2024 8:19 AM IST
ఏపీలో మహిళలకు మరో శుభవార్త

ఏపీలో మహిళలు అందరూ ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేడు వైసీపీ నాయకులు, కొన్ని పత్రికలు ప్రజలను మోసం చేస్తున్నారని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు.. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. మోసం చేసిన గత ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందనన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ విజయాన్ని అందించారుని, వారి రుణం తీర్చుకునేందుకు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలిసి పనిచేస్తున్నారన్నారు.

మా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మ్యాండెట్ ఇచ్చి బలం చేకూర్చిన నేపథ్యంలో, ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వంపై ఉందన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని స్థితిలో నేడు జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని నేడు వైసీపీ కార్యకర్తలే అనుకునే పరిస్థితి.. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం కన్న తల్లిని సొంత చెల్లిని బజారుకు ఈడ్చారన్నారు.. అసమర్థుడైనా జగన్ మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మోహన్ రెడ్డి, ప్రజల తరపున మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది.. నాడు ప్రతిపక్షంలో ఉండగా మేము ప్రజల తరపున, ప్రజల కోసం అనుక్షణం పోరాడాం. కానీ నేడు అలా కాకుండా, కేవలం బట్ట కాల్చి మోహం పైన వేసి సమాధానం చెప్పాలన్న చందంగా వైసీపీ నాయకులు తీరుందన్నారు. నేడు ఏపీలో రెండు రోజులుంటే, 5 రోజులు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్న జగన్ కు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు.

మంత్రి నారాయణ కూడా ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. అర్హులైన వారికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం.. హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామ‌న్నారు. ఐదేళ్లలో నెల్లూరును స్మార్ట్‌ సిటీ చేస్తామ‌న్నారు. దీపం-2 పథకం మహిళలకు వరం అని మంత్రి నారాయణ అన్నారు.

Next Story