టీటీడీలో మరో సంచలన పరిణామం..నలుగురు అన్యమత ఉద్యోగుల తొలగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
టీటీడీలో మరో సంచలన పరిణామం..నలుగురు అన్యమత ఉద్యోగుల తొలగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలతో నలుగురు టీటీడీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్, స్టాఫ్ నర్స్ రోసి, ఫార్మసిస్ట్ ప్రేమవతి, డాక్టర్ అసుంత క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. సంస్థ నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో మొత్తం నలుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లుగా సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రస్తావించారు.
సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.