విశాఖలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు 9వ తరగతి విద్యార్థులు 'లక్కీ భాస్కర్' సినిమా చూసి హీరోలా డబ్బు సంపాదించాలని పరారైన విషయం తెలిసిందే. హాస్టల్ గోడదూకి పరారైన వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. వారి ఫొటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. విజయవాడలోని మొగల్రాజపురంలో ఆ నలుగురు బ్యాగులతో తిరుగుతుండగా పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖకు పంపించారు.
ఇటీవల 'లక్కీ భాస్కర్' సినిమా చూసిన వారు హాస్టల్ నుంచి వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మూవీలో హీరో మాదిరి ఇళ్లు, కార్లు కొనడానికి డబ్బు సంపాదించిన తర్వాత తిరిగి ఇస్తామని స్నేహితులకు చెప్పి వెళ్లినట్టు తెలిసింది. చరణ్, రఘు, కిరణ్ కుమార్, కార్తీక్ అనే విద్యార్థులు అదృశ్యమయ్యారని హాస్టల్ ఇంఛార్జి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు విజయవాడలో గుర్తించారు.