దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు.
By - Knakam Karthik |
దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
విశాఖ : డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల శంకుస్థాపనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక అయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, సీఎస్ కే విజయానంద్, మంత్రులు టీజీ భారత్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు.
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి శంకుస్థాపన జరుపుకుంటున్న ఈరోజు చారిత్రాత్మకం. క్వాంటం వ్యాలీని జనవరిలో ప్రారంభించుకుంటున్నాం, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతున్నాం. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని మేమెప్పుడూ అందిపుచ్చుకుంటేనే ఉన్నాం. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం చేస్తే మరింతలా తీర్చిదిద్దుతాం. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలు తీసుకువచ్చేంతలా అభివృద్ధి చేస్తాం. ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది..అని సీఎం పేర్కొన్నారు.
కాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం ఉండనుంది. డ్రోన్ సిటీలో అధునాతన తయారీ పార్కులు, టెస్టింగ్ - సర్టిఫికేషన్ సెంటర్లు, 25,000 మంది రిమోట్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000కి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ సిటీలో 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 100 శాతం ఎస్జీఎస్టీ రాయితీ వంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
అటు శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో దేశంలోనే తొలిసారి ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు చేస్తోంది. ట్విన్ స్పేస్ సిటీస్‌తో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఉపగ్రహ ప్రోటోటైప్ తయారీ, స్పేస్ టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్, ఉపగ్రహ విభాగాల తయారీ, లాంచ్ లాజిస్టిక్స్ సపోర్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వనుంది. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా స్పేస్ టెక్ ఫండ్ కింద రూ.100 కోట్ల కేటాయింపులు చేసింది.
ఇక డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల నిర్మాణంతో భారత వైమానిక–అంతరిక్ష రంగాల్లో కొత్త శకం ఆరంభం కానుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి. స్పేస్ సిటీకి సంబంధించి బ్లూ స్పేస్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంవోయూ, డ్రోన్ సిటీలో పెట్టుబడులకు అల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ అనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్సెల్మేజ్, ఏర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థల అవగాహనా ఒప్పందం కుదిరింది.