ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంత్యక్రియలకు పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సూర్యనారాయణ ఆదర్శవంతమైన రాజకీయాలు చేశారని, పార్టీకి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ మరిచిపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుండ కుటుంబం పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపారు. తలకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పల సూర్యనారాయణ నిన్న ప్రాణాలు విడిచారు. శోకసంద్రంలో ఉన్న గుండ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా ఎప్పుడూ ఆయన సాధారణ జీవితం గడిపారని అన్నారు. నిజాయితీగా ఎంతో ఆదర్శవంతమైన రాజకీయాలు చేశారని కొనియాడారు. శ్రీకాకుళం అభివృద్ధికి నిరంతరం తపన పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.