మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో జగన్ ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు అండగా నిలవాలని బ్రహ్మనాయుడుకు సూచించారు. రేపు తాను వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్ జగన్ తెలిపారు. బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్.. ఇవాళ తాడేపల్లికి రానున్నారు.
''రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు'' అని ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని వైఎస్ జగన్ అన్నారు.
బుధవారం రాత్రి వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే రషీద్ అనే యువకుడిని జిలానీ అనే యువకుడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది.