ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. డ్రైవర్ బాబ్జి కి గాయాలయ్యాయి. ప్రమాదంలో నీరజారెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ఆమె అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం నీరజారెడ్డి ఆలూరు బీజేపీ ఇన్చార్జిగా ఉన్నారు. గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన నీరజారెడ్డి భర్త పాటిల్ శేసిరెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో మరణించారు.