ముంబై నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఆంజనేయులును హైదరాబాద్‌లోని బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆంజనేయులును పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంబై నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కాంతి రాణా టాటా , విశాల్ గున్నీలతో పాటు పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా సస్పెన్షన్‌లోనే ఉన్నారు. అదే విధంగా జెత్వానీ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.