రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

పీడీఎస్‌ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్‌ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు.

By Medi Samrat  Published on  31 Dec 2024 3:14 PM IST
రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

పీడీఎస్‌ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్‌ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణా జిల్లా బందర్ పోలీసులు పేర్ని నానిని ఆరో నిందితుడిగా చేర్చారు. పేర్ని నాని భార్య జయసుధ ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

జయసుధకు స్థానిక కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండో నిందితుడు మానస తేజ, మేనేజర్‌ నాని, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లర్‌ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావులను అరెస్టు చేశారు.

నలుగురు నిందితులను సోమవారం అర్థరాత్రి మచిలీపట్నం ప్రత్యేక మొబైల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారికి 12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. జయసుధకు చెందిన బఫర్‌ గోదాం నుంచి పీడీఎస్‌ బియ్యం మాయమైన నేపథ్యంలో కేసు నమోదైంది.

248 టన్నుల రేషన్ బియ్యం నిల్వలో అవకతవకలు జరిగాయని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపొట్లపాలెం గ్రామంలోని గోదామును ఆయ‌న‌ భార్య పేరు మీద రిజిస్టర్ చేసి, ఆ తర్వాత బఫర్ గోడౌన్‌గా పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఆ గోదాము పేర్ని నాని, ఆయ‌న‌ కుమారుడు కృష్ణ మూర్తి అలియాస్ కిట్టు పర్యవేక్షణలో ఉంది.

గోదాములో నిల్వ ఉంచిన 7,577 బస్తాల పీడీఎస్ బియ్యం మాయమైనట్లు అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో గుర్తించారు. దీంతో జయసుధ, నానికి సమన్లు ​​జారీ చేశారు. అయితే, వారు విచారణ అధికారుల ముందు హాజరుకాలేదు. అనంతరం జయసుధ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అరెస్టయిన నలుగురు నిందితులను విచారించిన పోలీసులు నానికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించిన తర్వాత నిందితుల జాబితాలో చేర్చారు. నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్‌పే, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా జరిగిన చెల్లింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు.

Next Story