అమరావతి: తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులకు సూచించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని పవన్ ఆదేశాలిచ్చారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని, జల్ జీవన్ మిషన్ పథకం అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు.
గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు అటవీ భూముల ఆక్రమణ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష చేశారు. అటవీ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు ఆక్రమణపై రేపు మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. పొల్యూషన్ ఆడిట్ నివేదికపైనా అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు పవన్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. పవన్ కేవలం పండ్లు, ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటున్నారు.