ఏపీకి బిగ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 16 Oct 2024 6:42 AM ISTఏపీకి బిగ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని పేర్కొంది. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు నెల్లూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, తిరుపతి, చిత్తూరు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అనంతపురం, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం నాడు నెల్లూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం నాడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి, అధికారులతో మాట్లాడారు.