కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

Five students go missing in Krishna river.సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇచ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 8:27 AM IST
కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇచ్చారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 12 నుంచి 13 సంవ‌త్స‌రాల పిల్ల‌లు సెల‌వులు కావ‌డంతో ఈత కొట్టేందుకు కృష్ణా న‌దిలోకి దిగారు. ఒకరి త‌రువాత మ‌రోక‌రు మొత్తం ఐదుగురు చిన్నారులు గ‌ల్లంతు అయ్యారు. ఈ విషాద ఘ‌ట‌న కృష్ణా జిల్లా చంద‌ర్ల‌పాటు మండ‌లంలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఏటూరు గ్రామానికి చెందిన కర్ల బాలయేసు (12), మాగులూరి సన్నీ (12), అజయ్ (12), జెర్రిపోతుల చరణ్ (13), మైల రాకేష్ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడ‌వ తరగతి చదువుతున్నారు. సెలవులు కావ‌డంతో వీరు మున్నేరులో ఈత‌కు వెళ్లారు. ఉద‌యం ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు రాత్రి అయినా రాక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందిన త‌ల్లిదండ్రులు వారి కోసం వెతుకుతుండ‌గా.. మున్నేరు ఒడ్డున వారి దుస్తులు, సైకిళ్లు క‌నిపించించాయి. దీంతో వారు ఈత కొట్టేందుకు న‌దిలో దిగి గ‌ల్లంతైయ్యార‌ని బావిస్తున్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ‌ల్లంతైన చిన్నారుల కోసం గ‌జఈత‌గాళ్ల సాయంతో గాలింపు చేప‌ట్టారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మున్నేరు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడారు. గ‌ల్లంతైన విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ధైర్యం చెప్పారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. చేతికొచ్చిన పిల్లలు నదిలో గల్లంతు కావడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Next Story