ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం
Five of same family missing in Nellore.. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం సంచలనం
By సుభాష్ Published on 17 Nov 2020 4:30 PM ISTనెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. వీరు అదృశ్యం కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటగిరి మండలం జీకే పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. వీరంతా సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. అదృశ్యమైన ఐదుగురిని గుర్తించేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎలా అదృశ్యమయ్యారని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అదృశ్యమైన వారిలో కొలిపాక సుప్రియ (25), పోలేపాక విజయం (27), దవ్యశ్రీ (7 నెలలు), సురేఖ (2), త్రివేణి (3) ఉన్నారు. కనిపించకుండా పోయిన మహిళలు ఇద్దరూ తోడికోడళ్లు. వీరి వద్ద ఉన్న సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్లడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కనిపించకుండా పోయిన ఘటన గ్రామంలో కలకలం రేపుతోంది.
పిల్లలకు ఒంట్లో బాగా లేదని ఆస్పత్రికి వెళ్లి చూపిస్తామని వెళ్లిన వీరు.. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేక ఇంకేదైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రికి ఆటోల్లో వెళ్లిన వీరు.. ఆ తర్వాత ఇంటికి చేరుకోకపోవడం మిస్టరీగా మారింది.