అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ మహిళ గొంతులో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమెకు చికిత్స అందించగా ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. వివరాల ప్రకారం.. వరరామచంద్రపురం మండలం కుంజవారిగూడెంకు చెందిన పలు కుటుంబాలు ఇంటి స్థలం పట్టాలు కోరుతూ ఎటపాక మండలం గంగారం సమీపంలో తాత్కాలికంగా స్థిరపడ్డారు. అక్కడ నివసిస్తున్న ముగ్గురు మహిళలు వలలు తీసుకుని గంగారం చెరువులో చేపల వేటకు వెళ్లారు. ముగ్గురు మహిళల్లో ఒకరైన సీత వలలో చిన్న చేప చిక్కింది. ఆ చేపల మధ్య ఓ చిన్న చేప చేతికి చిక్కింది. ఈ క్రమంలోనే ఒక చేత్తో వల పట్టుకుని మరో చేత్తో చేపను పట్టుకునేందుకు ప్రయత్నించింది.
చేప చేతిలో పట్టుకున్న గిల గిల కొట్టుకుంటోందని, ఆమె ఆ చేపను నోటితో పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆ చిన్న చేప ఉన్నపలంగా ఆమ గొంతులోకి జారి గొంతులో ఇరుక్కుపోయింది. ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆమెకు శ్వాస సరిగా అందకపోవడంతో వెంటనే భద్రాచలం ఆస్పత్రికి తరలించగా, గొంతులో చిక్కుకున్న చేపను వైద్యులు జాగ్రత్తగా బయటకు తీశారు. ఆక్సిజన్ లేకపోవడంతో మహిళ ముఖం వాచిపోయింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.