ప్రయాణీకులతో వెలుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది దాకా ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణీకులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే బస్సు దిగిపోయారు. మంటల్లో బస్సు కాలి బూడిదైంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
శుక్రవారం ఉదయం సుమారు 40 మంది ప్రయాణీకులతో విజయవాడ నుంచి గుడివాడ వెలుతున్న ఆర్టీసీ బస్సు పెదపారుపూడి మండలం పులవర్తిగూడెం వద్దకు వచ్చే సరికి ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణీకులను అప్రమత్తం చేశాడు. ప్రయాణీకులు వెంటనే బస్సులోంచి కిందకు దిగి దూరంగా పరిగెత్తారు. కంగారులో చాలా మంది ప్రయాణీకులు తమ వస్తువులు, బ్యాగులను బస్సులోనే వదిలివేశారు.
బ్యాగుల్లో ఉన్న నగదు, బంగారం, దుస్తులు కాలిపోయినట్లు పలువరు ప్రయాణీకులు చెబుతున్నారు. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ డ్రైవర్ గమనించకుండా అలాగే బస్సును నడిపిఉంటే..ఏం జరిగి ఉండేదే ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందని పలువురు ప్రయాణీకులు అన్నారు.