భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం: అచ్చెన్నాయుడు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 11:10 AM ISTభద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం: అచ్చెన్నాయుడు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 40కి పైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనతో మత్స్యకారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బోట్ల ద్వారానే సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకుని జీవనం గడుపుతున్నామని.. అలాంటిది ఇప్పుడు అవి కాలిపోవడంతో బతుకుదెరువు ప్రశ్నార్థకం అయ్యిందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణమన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతన్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నిర్లక్ష్యం కారణంగా కార్మికులు, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. విశాఖలో గతంలో చాలా పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. సీఎం జగన్‌కు రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై లేదని ఆరోపించారు అచెన్నాయుడు. ఈ సంఘటనలో బోట్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని.. కొత్త బోట్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోమారు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు.
ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించాలని చెప్పారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే తగిన విధంగా నష్టపోయినవారికి సహాయం చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.