విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల కింటే.. విశాఖలోని హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటనను మరువక ముందే.. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సింహాచలంలో ఉన్న ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి.
సబ్ స్టేషన్లోని 10/16 ట్రాన్స్ ఫార్మర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సబ్ స్టేషన్‌లోని మిగిలిన ట్రాన్స్ ఫార్మర్లకు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాను పునురుద్దరించామని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రతాప్ తెలిపారు.
ప్రమాదం జరగడానికి గల కారణం, నష్టం అంచనా వేయడానికి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.