రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా వైద్యుడి మృతి
Fire accident in private Hospital in Renigunta three dead.రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 25 Sep 2022 3:58 AM GMTతిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు డాక్టర్ మరణించాడు.
వివరాలు ఇలా ఉన్నాయి.. రేణిగుంట పట్టణం భగత్‌సింగ్ కాలనీలో కార్తీక క్లినిక్ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఆస్పత్రిని నిర్వహిస్తున్న భవనంలోనే పై అంతస్తులో రవిశంకర్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున డాక్టర్ కుటుంబం నివసిస్తున్న అంతస్తులో మంటల చేలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది డాక్టర్ భార్య, అత్త, కుమారుడు భరత్(12), కుమారై కార్తీక(15)లను బయటకు తీసుకువచ్చారు. వీరిలో ఇద్దరు మహిళలు ప్రమాదం నుంచి సురక్షితంగానే బయటపడగా.. ఇద్దరు చిన్నారులు దట్టమైన పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న డాక్టర్ రవిశంకర్ రెడ్డిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి. అయితే.. అప్పటికే ఆయన సజీవ దహనం అయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.