అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ రుణాలపై శాసన మండలి సభ్యుల ప్రశ్నలకు పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ప్రజల కోసం అవసరమైన మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఎక్కడా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఉల్లంఘించడం లేదని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తరహాలో అప్పులను ఇతర అవసరాలకు మళ్లించడం లేదన్నారు.
2024 జూన్ 12నాటికి గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 9 లక్షల 74 వేల 556 కోట్లు అప్పులు చేసిందని సభకు తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కళ్లుగప్పి పలు సంస్థలు సృష్టించి నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చిందన్న మంత్రి...గత ప్రభుత్వం చేసిన ఘనతతో ఎక్కడా పునరావృతం కాకుండా, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ పై తీసుకున్న అప్పులు సైతం ఎఫ్ ఆర్ బీఎం లోకి తెస్తూ గతంలో కేంద్రం సర్కులర్ తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీఎం నిబంధనలను దాటి అప్పులు చేయడం లేదన్నారు. 25-26 ఏడాదికి మొత్తం దాదాపు 80 వేల కోట్లు అప్పులు తీసుకోవాలని తాము ప్రతిపాదించామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 35 వేల 305 కోట్లు మాత్రమే రుణాలు తీసుకున్నట్లు సభకు తెలిపారు.