టీడీపీలో చేర‌నున్న ప్రముఖ సినీ నిర్మాత

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  30 Dec 2023 6:15 AM GMT
టీడీపీలో చేర‌నున్న ప్రముఖ సినీ నిర్మాత

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని, అయితే, జగన్ తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారన్నారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. ఆయన తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. విశాఖపట్టణానికి కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు వచ్చినట్టు మంత్రి అమర్ నాథ్ చెబుతున్నారని, ఎక్కడ, ఎన్ని ఏమేమి పరిశ్రమలు వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని నట్టి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు దేశం పార్టీ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి 152 సీట్లు, వైసీపీకి 23 సీట్లు వస్తాయని నట్టి జోస్యం చెప్పారు.

వ్యూహం చిత్రం గురించి టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. వ్యూహం సినిమా విడుదల ఆపాలని తాము సెన్సార్ బోర్డును కోరలేదని స్పష్టం చేశారు. ఈ మూవీ ద్వారా ఎవరిని కూడా విమర్శించొద్దని చెప్పామని.. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారిని వ్యంగ్యంగా చూపించకూడదని కోరినట్లు వెల్లడించారు. అయినప్పటికీ వాటిని పరిశీలించకుండానే సెన్సార్ పూర్తి చేశారని తెలిపారు. జీవిత రాజశేఖర్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వారిని తప్పించమని సెన్సార్ బోర్డును కోరినట్లు చెప్పారు.

Next Story