పోస్టర్లలో చిన్నగా ఫోటో.. గొడ‌వ‌ప‌డిన‌ టీడీపీ శ్రేణులు

తిరువూరు టీడీపీ కార్యాలయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.

By Medi Samrat  Published on  3 Jan 2024 9:00 PM IST
పోస్టర్లలో చిన్నగా ఫోటో.. గొడ‌వ‌ప‌డిన‌ టీడీపీ శ్రేణులు

తిరువూరు టీడీపీ కార్యాలయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంద మందితో బైక్ ర్యాలీగా కేశినేని నాని రాగా.. పోస్టర్ లో నాని ఫోటో చిన్నదిగా వేశారంటూ నాని అనుచరులు పోస్టర్లు చించి, కుర్చీలు విసిరి రభస చేశారు. కొద్దిసేపటికి వేలాదిమందితో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంలోని రూంలో ఎంపీ కేశినేని నాని కూర్చొని ఉన్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండటంతో ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. సమావేశానికి వెళ్లకముందే పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. ఈ గొడవల మధ్య ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్ళారు.

ఫర్నిచర్, అద్దాల ధ్వంసం

జనవరి 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ ఫ్లెక్సీల్లో కేశినేని నాని ఫొటో లేదు. చిన్ని ఫొటోలు ఉండటంతో నాని వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్నికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

Next Story