తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయయాయి. జీడిపిక్కల లారీ బోల్తా పడటంంతో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు బయలుదేరింది. చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో వాహనం అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
వాహనం తిరగబడటంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు మరణించారు. మృతులను సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ(45), చినముసలయ్య(35), కత్తవ కృష్ణ(40), కత్తవ సత్తిపండు(40), తాడి కృష్ణ(45), కాటకోటేశ్వరానికి చెందిన బొక్క ప్రసాద్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరిని తాడిమళ్లకు చెందిన ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.