నేటీ రోజుల్లో ఎక్కడ చూసినా కల్తీనే కనిపిస్తోంది. ఏ వస్తువు కొనాలన్నా అది నిజమైన వస్తువువో లేక నకిలీదో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. రోజురోజుకు కల్తీ చేసేవారు పెరిగిపోతున్నారు. ఏదో విధంగా జనాలను బురడీ కొట్టిస్తున్నారు. వస్తువులనే కాదు.. తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే కోడిగుడ్లు ఎంత సున్నితంగా ఉంటాయో అందరికి తెలిసిందే. పట్టుకోవడంలో ఏ మాత్రం తేడా వచ్చినా చాలు.. పగిలిపోతుంటాయి. అలాంటి కోడిగుడ్లను సైతం నకిలీ చేశాడు ఓ కేటుగాడు. నెల్లూరు జిల్లాలో నకిలీ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి.
ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను తెచ్చి అమ్మాడు. 30 కోడి గుడ్ల ధర కేవలం రూ.130 కే అమ్మాడు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో.. నిపుణులు గుడ్లను తినాలని చెబుతున్నసంగతి తెలిసిందే. తక్కువ ధరకే గుడ్లు వస్తుండడంతో స్థానికులు పెద్ద మొత్తంలో గుడ్లను కొనుగోలు చేశారు. అవి ఎంతసేపటికి ఉడక్కపోవడంతో మోసపోయామని గ్రహించారు. గుడ్డుపై ఉన్న పెంకు ప్లాస్టిక్ పదార్థంగా ఉందని.. లోపల తెల్లసొన కూడా తేడాగా ఉందని అంటున్నారు. అంతేకాదండోయ్ ఆ గుడ్డును నెలకేసి కొట్టగా బంతిలా ఎగురుతోందని అంటున్నారు. అవి నకిలీ కోడిగుడ్లు అని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా.. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.