ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును అక్టోబర్ 30 వరకు పొడిగించింది. దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ శనివారం తెలిపారు. పేద విద్యార్థులు విదేశాల్లో ప్రఖ్యాతి గాంచిన యూనివర్శిటీల్లో విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విదేశీ దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ (అగ్రవర్ణ పేద), వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 392 దరఖాస్తులు రాగా.. దరఖాస్తు చేసుకోలేని మరింత మంది ఈ పథకంలో లబ్ధి పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవకాశం కల్పించి దరఖాస్తు గడువును మరో నెల పొడిగించింది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని హర్షవర్ధన్ వివరించారు. ఈ పథకం నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుండి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జగనన్న విద్యా దేవెన పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఒకటి నుండి 100 ర్యాంకుల్లో ఉండే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువు కోసం కోటి రూపాయలైనా ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో రీయంబర్స్ చేస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.