ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 7 April 2026 8:30 PM IST

Andrapradesh, CM Chandrababu, APGovt, FreeSandPolicy, EducationReform, RTGS

ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి: సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో, వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి వారిలో పూర్తి సంతృప్తి కలిగించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

గృహ నిర్మాణ రంగానికి సంబంధించి సీఎం పలు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని భారీగా చేపట్టాలని నిర్ణయించారు. టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నారని, వారికి తక్షణమే స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఇసుక సరఫరా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా నిల్వలను పెంచుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానం అమలవుతున్న నేపథ్యంలో, రవాణా పేరుతో రీచ్‌లు లేదా స్టాక్ యార్డుల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను హెచ్చరించారు.

ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కాలేజీ విద్యలో రీ-ఓరియెంటేషన్ తీసుకురావాలని, కరిక్యులమ్‌ను రీ-స్ట్రక్చర్ చేస్తూ కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందులో ఉన్నత విద్యామండలి మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.

ప్రజా భద్రత అంశంపై స్పందిస్తూ, మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి ఫిర్యాదులకు తావుండకూడదని సీఎం స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, విద్యుత్ మరియు కేబుల్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు శాప్ ఆధ్వర్యంలో 5కే రన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి యువతను భాగస్వాములను చేయాలన్నారు. పిడుగుపాటు మరణాల నివారణకు టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకోవాలని సూచిస్తూ, ఆర్టీజీఎస్ రూపొందించిన ‘అవేర్ 2.0’ మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Next Story