టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ నుండి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వైదొలగడానికి కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కారణమని, వ్యక్తిగత కారణాల వల్ల కాదని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరనుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంపద విధ్వంసం జరిగింది.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సంపద సృష్టిపై దృష్టి సారిస్తున్నారని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు.
రానున్న రోజుల్లో గుంటూరులో ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ అగ్రనాయకత్వంలో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకాల ఒప్పందంపై అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లోనే వెలువడుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పొత్తుపై ప్రాథమిక అవగాహన కుదిరిందని, ఒకటి రెండు రోజుల్లో తుది సీట్లను ప్రకటిస్తామని నాయుడు తెలిపారు.