ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్‌లో సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌లోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు
By - Knakam Karthik |
ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్‌లో సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌లోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈలోని దుబాయ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి సీఐఐ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీలోని అపారమైన అవకాశాలను వారికి వివరించారు. దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గౌరవించారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ... పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.
వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు...గనుల నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి సుదీర్ఘంగా పారిశ్రామిక వేత్తలకు వివరించారు. పెట్టుబడులతో పాటు ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనా అంశాల గురించీ వారికి వివరించారు. గడచిన 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఫ్యూచర్ టెక్నాలజీల కేంద్రం విశాఖ
"గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థ భారీ పెట్టుబడితో విశాఖలో ఏఐ డేటా హబ్ ను ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. ఆధునికత సాంకేతికతతో భవిష్యత్ నగరంగా విశాఖ తయారవుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దుబాయ్ దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందింది. దుబాయ్ దేశ జనాభా 3 మిలియన్లు... కానీ ఈ దేశాన్ని ఏడాదిలో సందర్శించే పర్యాటకుల సంఖ్య 18 మిలియన్లు. ఏపీలో కూడా పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ప్రాంతాలే కాకుండా... ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి దివ్య క్షేత్రం ఏపీలోనే ఉంది.
7 యాంకర్ హబ్స్... 25 థిమెటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులిచ్చాం. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. ఆర్సెల్లార్ మిట్టల్ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 48 యూనివర్శిటీలున్నాయి.. 9 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి... స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. మైక్రో సాఫ్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది... ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి జరుగబోతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలున్నాయి. ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రమైనా...వివిధ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఉద్యావన రంగంలో, తీర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ కు అద్భుత అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల లాంటి మౌలిక సదుపాయలు కల్పిస్తున్నాం." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సరైన పారిశ్రామిక ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం
"టెక్నాలజీతో వచ్చే లాభాలను అర్థం చేసుకుని నేను ఐటీని ప్రమోట్ చేశాను. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం. తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ నూతన ప్రణాళికల్ని అమలు చేస్తోంది. 2071 నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపోందించుకున్నారు. అమరావతిలో లైబ్రరీ నిర్మాణం కోసం రూ.100 కోట్లు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శోభా గ్రూప్ కు ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వానికి ఉన్న క్రెడిబులిటీ వల్లే విరాళం ఇచ్చేందుకు శోభా గ్రూప్ ముందుకు వచ్చింది. దుబాయ్ లోని పారిశ్రామిక వేత్తలను వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సదస్సుకు ఆహ్వానిస్తున్నాను ఎంఓయూల తో పాటు సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం కూడా ఇచ్చేస్తాం. ఏపీకి రండి.రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించండి... పెట్టుబడులు పెట్టండి." అని ముఖ్యమంత్రి అన్నారు.