మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరు
Ex-MP Kothapally Geetha couple granted bail. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఎట్టకేలకు ఊరట లభించింది.
By Medi Samrat Published on 16 Sep 2022 1:30 PM GMTమాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలతో వారికి శిక్షపడగా.. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత, భర్త రామకోటేశ్వరావుతో పాటు ముగ్గురు బ్యాంక్ అధికారులకు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన సీబీఐ కోర్టు జైలుకు తరలించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి గీత దంపతులు రూ.52 కోట్ల లోన్ తీసుకున్నారు. బ్యాంకుకు తప్పుడు వివరాలను అందించారని, బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ సీబీఐ 2015 జూన్ 30న కొత్తపల్లి గీత, ఆమె భర్త, మరో ముగ్గురుపై చార్జిషీట్ దాఖలు చేసింది. కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశం, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష, నిందితుల జాబితాలో ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.