ఫోన్లు ట్యాపింగ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. సీఎం జగన్ వలనే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి అనేకసార్లు చెప్పారు. కోటంరెడ్డి లాంటి వాళ్లు వెళ్లిపోవడం పార్టీకి మంచిది. ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ పట్టలేదని అన్నారు. పార్టీ మారాలి అనుకున్నాడు కాబట్టే.. కోటంరెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని.. కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు ఉందని సందేహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నారు. బలమైన సామాజిక వర్గాలకు పదవులిస్తే.. బలహీన వర్గాలు ఏమైపోతాయని జగన్ ఆలోచిస్తున్నారు. సీఎం జగన్‌కు అబద్దాలు చెప్పడం చేతకాదు.. ఏదైనా ముక్కుసూటిగా చెబుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌ను ఏం చేయలేకపోయారు.. ఇప్పుడు ఏం చేస్తారు...? ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డు కాదని ఎవరు చెప్పారు..? కోటంరెడ్డిని ప్రశ్నించారు. మాకందిన సమాచారం పోలీసులతో పంచుకోవడం సహజమే.. ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు.
ఇంటెలిజెన్స్ డీజీ ఎమ్మెల్యేలకు మెస్సేజ్‌లు పెట్టకూడదా...? అని ప్రశ్నించారు. జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ బీ ఫారం ఇస్తానంటే.. నెల్లూరు నుంచి జనం క్యూ కడతారని అన్నారు. సీఎం జగన్ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.