2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.

By -  అంజి
Published on : 12 Nov 2025 2:00 PM IST

poor persons own house, own house, CM Chandrababu, APnews

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని అన్నారు.

ఇల్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్తుకు భద్రత అని అన్నారు. పేదలకు మొదటిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. కూడు, గూడు, దుస్తులు.. అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు అభినందనలు తెలిపిన సీఎం.. మిగతా ఇళ్లు కూడా త్వరలోనే పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పారు. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామని, ప్రతి ఇంటి నుండి ఒకరు పారిశ్రామికవేత్త తయారు కావాలని చంద్రబాబు అన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని, వైసీపీ హయాంలో 4 లక్షలకుపైగా ఇళ్లను రద్దు చేశారని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి వచ్చే ఇటుకలోనూ దోచుకున్నారని చెప్పారు. తమది పేదల ప్రభుత్వం అని.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని తెలిపారు.

Next Story