ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 15 ప్రాజెక్టుల ఇన్వెస్ట్‌మెంట్లకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20 వేల ఉద్యోగాల కల్పన జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై కూడా సీఎం చంద్రబాబు ఈ భేటీలో చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుల గ్రౌండ్ వర్క్ అయ్యేలా చూడాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, మంత్రులకు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలను చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తోన్న స్పందన సంతృప్తికరంగా ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.