స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: సీఎం చంద్రబాబు
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 6:42 PM IST
స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: సీఎం చంద్రబాబు
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని.. వాటిని కచ్ఛితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు.. అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సీఎం సమీక్ష చేపట్టారు. ప్రతి నెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోందని తెలిపారు.
మన మూలాలు, మన బలాలు తెలుసుకునేలా, రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటకరంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సీఎం సూచించారు. సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగులు వేయడం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత, ఘన వ్యర్ధాల నిర్వహణ, ప్రజారోగ్యం, ఇంకా కేంద్రం నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
స్వచ్చాంధ్ర అంటే స్వచ్చమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్లు అని అంతా గుర్తించాలని సీఎం అన్నారు. ఇళ్లతో పాటు, బహిరంగ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగి, ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ పనిచేయాలన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో, ఒక్క అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని...పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోలని సిఎం పిలుపునిచ్చారు.
ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఆ కార్యాలయంలో ఉండే ఉద్యోగులు అంతా కలిసి పరిశుభ్రత, ఆహ్లాదకర వాతారవణం ఉండేలా కృషి చేయాలన్నారు. రోడ్లపై చెత్త వేసి, చెట్లు నరికి వేసి, అంతా క్లీన్ గా ఉండాలి, పచ్చదనం ఉండాలి అని స్లోగన్స్ ఇస్తే కుదరదని అన్నారు. పౌరులు కూడా బాధ్యత వహిస్తే స్వచ్చాంధ్ర కల సాకారం చేసుకోవచ్చని సీఎం సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అంతా కృషి చేయాలి అన్నారు.